‘రెమల్’ తుఫాను నేపథ్యంలో, కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
“కోల్‌కతాతో సహా పశ్చిమ బెంగాల్ తీరప్రాంతంపై రెమాల్ తుఫాను ప్రభావం దృష్ట్యా, వాటాదారులతో సమావేశం జరిగింది. కోల్‌కతాలో గాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయిని భారీ అంచనాల కారణంగా మే 26న 12:00 IST నుంచి మే 27న 09:00 IST వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించారు.” అని NSCBI విమానాశ్రయ డైరెక్టర్ సి పట్టాభి ఒక ప్రకటనలో తెలిపారు.
అంతేకాకుండా, కోల్‌కతా పోర్ట్ కూడా ఆదివారం సాయంత్రం నుంచి 12 గంటల పాటు అన్ని కార్గో, కంటైనర్ హ్యాండ్లింగ్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పోర్ట్ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు పోర్ట్ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో తొలిసారిగా మే 22న గమనించిన అల్పపీడనం మరింత తీవ్రరూపం దాల్చింది, ఇప్పుడు మధ్య బంగాళాఖాతంలో ఉంది. పశ్చిమ బెంగాల్, కోస్టల్ బంగ్లాదేశ్, త్రిపుర, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ఇతర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
తుఫాను మే 26 అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.