వరంగల్ వాసుల దశాబ్దాల కల వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి మళ్లీ కొత్త రెక్కలు వచ్చాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటు పైన మళ్ళీ ఆశలు చిగురించాయి. విమానాశ్రయ నిర్మాణానికి ఉన్న చిక్కుముడులు ఒకటొకటిగా విడిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రభుత్వ సానుకూలత పై వేచిచూసే ధోరణితో ఎదురుచూస్తోంది.
వరంగల్ విమానాశ్రయ నిర్మాణం విషయంలో కదలిక ఈ క్రమంలో తాజాగా వరంగల్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఎయిర్పోర్ట్ అథారిటీ లో కదలిక వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం విషయంలో సుముఖత వ్యక్తం చేయడంతో వరంగల్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ విమానాశ్రయం భూ కేటాయింపుపై క్షేత్రస్థాయిలో పరిశీలన వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వీలుగా ప్రస్తుతం ఉన్న 706 ఎకరాల భూమికి, అదనంగా 253 ఎకరాలను కేటాయిస్తూ గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు వరంగల్ విమానాశ్రయం పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.
దశలవారీగా విస్తరించాలని గత ప్రభుత్వ నిర్ణయం అయితే గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైదరాబాదుకు చెందిన జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తో పాటు, రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. అంతేకాదు దశలవారీగా ఎయిర్ పోర్టును విస్తరించాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందు ఏటీఆర్ స్థాయి నుంచి చిన్న విమానాల రాకపోకలకు వీలుగా నిర్మాణం జరపాలని, దీనికి అనుగుణంగా 253 ఎకరాలను అదనంగా కేటాయించింది.
పూర్తి స్థాయిలో విమానాశ్రయ నిర్మాణానికి గత సర్కార్ విముఖత అయితే కనీసం 400 ఎకరాల భూమి కావాలని, విస్తరణకు సుమారు 1200 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని ఎయిర్పోర్ట్ అధికారులు అంచనా వేసి నివేదికను అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి పంపించారు. అంత మొత్తాన్ని ఖర్చు చేయడానికి అప్పటి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదని, 400 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల వరకు విమాన రాకపోకలకు ఏర్పాట్లు చేయాలని, ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
కాంగ్రెస్ సర్కార్ ఆలోచన ఏమిటో? అయితే విమానాశ్రయం నిర్మాణాన్ని ఒకేసారి చేసినట్లయితే అన్ని విధాల ఉపయోగం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసినా, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారా? లేక గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోనే ముందుకు వెళతారా? అన్నది తెలియాల్సి ఉంది.
తెలంగాణాకు ఎయిర్పోర్ట్ అధికారుల బృందం లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వరంగల్ విమానాశ్రయ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరపనున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నేపథ్యంలో దీనిపై రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే త్వరలో వరంగల్ విమానాశ్రయ ఎయిర్ స్ట్రిప్ ను పరిశీలించడంతో పాటు ఇక్కడ ఉన్నతాధికారులతో చర్చలు నిర్వహించడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారుల బృందం వరంగల్ కు రానుంది.