సీఎం రేవంత్‌ రెడ్డిపై.. కోమటిరెడ్డి ఆసక్తికర కామెంట్స్.. ..

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మనసులోని ఏదీ ఉంచుకోరు. ఏది అనుకుంటే అది బయటకు చెప్పేయడం ఆయనకు అలవాటు. ఈ విషయంలో ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోరు. తాజాగా ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చూస్తుంటే తనకు దివంగత మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి గుర్తుకు వస్తున్నారని మనసులోని మాట బయటపెట్టారు.

 

కారు పార్టీ అధినేతను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి.. ఎవరు వచ్చినా ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకునే విధానం బాగుండాలన్నారు. అదే నాయకుడి లక్షణమన్నారు. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారాయన. మరో పదేళ్లు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని కుండబద్దలు కొట్టేశారు. తనకు పదవులపై ఏమాత్రం ఆశలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టినప్పుడు మూడు రాత్రులు తాను కనీసం గది నుంచి బయటకు రాలేదన్నారు. కొందరు ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకున్నారని, తాను మాత్రం ఎక్కడికీ వెళ్లలేదన్నారు.

 

జూన్ ఐదున.. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి. త్వరలో బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు తనను సంప్రదించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాదు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ జాతకం ఎలా ఉంటుందో కూడా వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ప్రస్తుతం అసెంబ్లీ సీట్ల సంఖ్య 154కు పెరుగుతుందని, అందులో 125 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచు కుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

 

పనిలోపనిగా బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి కోమటిరెడ్డి. మద్యం కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కవిత బతుకమ్మ చుట్టూ తిరుగుతుందని అనుకున్నామనీ, లిక్కర్ బాటిల్ చుట్టూ తిరుగుతుందని ఊహించలేకపోయామని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు కేసీఆర్‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటానన్న తలసానిపైనా తనదైన శైలిలో సెటైర్లు వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *