విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో ప్రధానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కూటమి రోడ్ షో కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. వేలాదిగా తరలివచ్చిన జనం రోడ్ షోలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు.
ఏపీలో కూటమి గెలుపే లక్ష్యంగా మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజుల సమయమే ఉండటంతో బరిలో నిలిచిన అభ్యర్థుల తరపున పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి తరపున రంగంలో దిగిన మోదీ విజయవాడలో రోడ్ షో నిర్వహించారు.
ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు మోదీ రోడ్ షో కొనసాగింది. 1.5 కిలో మీటర్ల మేర కొనసాగిన ఈ రోడ్ షోలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 5 వేల మంది పోలీసులతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్ షో కోసం నగరంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.