ఒడిశా కరోనా కాలంలో పురుటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి సినీ రచయిత పురుడు పోశారు. వెట్ట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన సంచలన చిత్రం విచారణై చిత్ర రచయిత చంద్రన్. కోవైకు చెందిన ఆటో డ్రైవర్ అయిన ఈయన స్వీయ సంఘటనలతో లాకప్ పేరుతో రాసిన నవలనే వెట్ట్రిమారన్ విచారణై పేరుతో చిత్రంగా రూపొందించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. చంద్రన్ నివసిస్తున్న కోవై, సింగనల్లూర్ ప్రాంతంలో ఒడిశాకు చెందిన భవన నిర్మాణ కార్మికులు కొందరు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వారిలో నిండు గర్భిణికి పురుటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అది రావడం ఆలస్యం కావడంతో ఆటోడ్రైవర్ చంద్రన్‌కు ఫోన్ చేశారు. ఆయన వెంటనే వచ్చారు. అప్పటికే ఆ మహిళ ప్రసవ వేదనతో బాధపడుతోంది. కరోనా భయంతో ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చంద్రన్‌నే ఆ మహిళకు పురుడు పోసి రియల్ హీరో అనిపించుకున్నాడు.