జనసేనకు బిగ్ షాక్.. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు..

ఎన్నికలకు ముందు జనసేనకు భారీ షాక్ తగిలింది. గాజు గ్లాసు గుర్తుపై వరుస వివాదాలు నెలకొంటున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం నిర్ణయం కారణంగా జనసేనకు పెద్ద చిక్కొచ్చిపడింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగియడంతో స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గుర్తులను కేటాయించింది. అయితే గాజు గ్లాసు గుర్తును.. జనసేన పోటీ చేయని స్థానాల్లో పలువురు స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ కేటాయించింది.

 

మొన్న జనసేన అభ్యర్థులను పోలిన పేర్లతో జాతీయ జనసేన, నవతరం పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రస్తుతం జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులతో పాటు నవతరం పార్టీ అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించింది. దీంతో ఈసీ నిర్ణయంపై కూటమి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

 

విజయనగరం టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీతకు గాజు గ్లాస్ సింబల్ రావడంతో టీడీపీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విజయవాడ, మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థులు కృష్ణ కిషోర్‌కు, రావు సుబ్రహ్మణ్యంకు, జగ్గంపేట జనసేన రెబల్ అభ్యర్థి సూర్యచంద్రకు గాజు గ్లాసు కేటాయించబడ్డాయి.

 

అలాగే మచిలీపట్నం, జగ్గయ్యపేట స్వతంత్ర అభ్యర్థులకు, ధర్మవరం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను నవతరం పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు కేటాయింపులు జరిగాయి. గుంటూరు, విజయవాడ పార్లమెంట్ నవతంర పార్టీ అభ్యర్ధులకు, కావలి స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.

 

ఈసీ నిర్ణయంతో జనసేన, టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జనసేన పోటీలో లేని చోట గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌గా ఈసీ ఉంచింది. నవతరం పార్టీకి ఇప్పటి వరకు 3 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఈసీ కేటాయించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *