హయత్‌నగర్ నుంచి మెట్రోను విస్తరించే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ వాసులకు కీలక హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ పదేళ్లలో తెలంగాణకు నిధులు, పరిశ్రమలు ఇవ్వలేదని విమర్శించారు.
మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి వనస్థలిపురం, ఎల్బీనగర్ లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. ఈ నియోజకవర్గం నుంచి సునీతకు 30వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు.
వరద ముంపు సమస్యతో పాటుగా హయత్‌నగర్ నుంచి మెట్రోను త్వరలోనే విస్తరించే బాధ్యత తనదని వెల్లడించారు. తెలంగాణను నిండా ముంచేందుకే మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాకర్టీ కూడా ఇవ్వకుండా తరలించుకు పోయారని మండిపడ్డారు. మోదీ విభజన హామీలపై క్లారిటీ ఇచ్చిన తర్వాతనే రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు.
వరదలు వచ్చినప్పుడు బండిపోతే బండి ఇస్తామన్న బండి సంజయ్.. బండి రాలేదు గుండు రాలేదు అని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అరగుండు వచ్చి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కారు పంక్చర్ అయిందని, అందుకే బస్సు పట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కే పరిమితం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.