ఈనెల 30వ తేదీన కూటమి మేనిఫెస్టోను ప్రకటిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మాఫియా డాన్ లతో పోరాడుతున్నాం.. ప్రజల దశ, దిశ మార్చే ఎన్నికలు ఇవే అని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూటమిదే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఏపీని సీఎం జగన్ గంజాయి రాష్ట్రంగా మార్చారంటూ జనసేనాని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందన్నారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ నాయకులు గుండాలు, రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
తాను సినిమాలో పనిచేస్తే ఐదేళ్లలో రెండు వందల కోట్ల రూపాయలు సంపాదించి.. రూ.70 కోట్లు పన్ను కట్టాటని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజల భవిష్యత్తే తమకు ముఖ్యమని వెల్లడించారు. తాను రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం కోసమో రాజకీయాల్లోకి రాలేదని మరోసారి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జనసేనాని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులను వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేలా స్థానికంగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే కూటమి ప్రథమ లక్ష్యమని తెలిపారు. కష్ట, నష్టాల్లో ఉన్న ప్రజల గొంతుకనవుతాని వివరించారు. తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే జగన్ ఇన్నాళ్లుగా ప్రధాని మోదీ వెంట తిరిగారని అన్నారు.