త్వరలో..ఆహార వస్తువుల ధరల తగ్గుదల: ఆర్థిక మంత్రిత్వ శాఖ..

రుతుపవనాల సీజన్‌ తర్వాత ఆహార వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం ఉంటుందని భారత వాతావరణశాఖ అంచనా వేసిన నేపథ్యంలో పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది.

 

వర్షాలు ఎక్కువగా పడితే పంట దిగుబడులు కూడా అధికంగా వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలవారీగా సమీక్షలో పేర్కొంది. ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇతర దేశాల దిగుమతులను సులభతరం చేసింది. ధరలను కట్టడి చేసేందుకు రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ద్వారా క్రమబద్ధీకరించింది. పప్పు దినుసుల దిగుమతి కోసం అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

 

బ్రెజిల్‌ నుంచి 20వేల టన్నుల పెసరపప్పు దిగుమతి కానుండగా..అర్జెంటీనా నుంచి కందులు దిగుమతి చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ చర్చలు చివరి దశకు చేరుకున్నాయి.ఫిబ్రవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 8.7శాతం ఉండగా..మార్చి నెల నాటికి 8.5 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణం కూరగాయలు, పప్పుల దినుసుల ధరలు పెరగడమే. క్రిసిల్‌ నివేదిక సైతం జూన్‌ నెల తర్వాత కూరగాయల ధరలు తగ్గుతాయని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *