నోరెత్తిన మల్లారెడ్డి, పలకరిస్తే.. వైరల్ చేస్తారా..?

మనిషన్నాకా కాస్తంత కళా పోషణ ఉండాలన్నది ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో నటుడు రావుగోపాలరావు చెప్పిన డైలాగ్. అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అతికినట్టు సరిపోతుందని అంటున్నారు తెలంగాణలోని కొందరు రాజకీయ నేతలు. ఈటెల తనకు పాత మిత్రుడని 20 ఏళ్లపాటు బీఆర్ఎస్‌లో ఉన్నారన్నారు సదరు ఎమ్మెల్యే. ఏదో ఫంక్షన్‌‌లో ఎదురుపడి పలకరిస్తే.. తాను అన్నమాటల వీడియోను వైరల్ చేసేస్తారా అంటూ చమత్కరించారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.

 

శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓ వివాహ పంక్షన్‌కు హాజరయ్యారు. అదే సమయంలో మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా అన్నా నువ్వే గెలుస్తున్నావ్ అంటూ పలకరించారాయన. ఈ వీడియో సోషల్‌మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అయ్యింది. ఈ మాటలను గమనించిన పలువురు రాజకీయ నేతలు మల్లారెడ్డి కమలం పార్టీ వైపు చూస్తున్నారని అనుకున్నారు. రేపోమాపో ఆయన కూడా కారు దిగేయడం ఖాయమని అన్నారు.

 

అసలే ఎన్నికల వేడి.. ముఖ్యంగా మల్లారెడ్డి లాంటి నేతలు ఆ తరహాగా మాట్లాడడం గులాబీ నేతలకు నచ్చలేదట. ఇప్పటికే కారు పార్టీ నుంచి చాలామంది కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇలా మాట్లాడడం సరికాదని మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మద్దతుదారులు బహిరంగంగా విమర్శించారు. ఇది ముమ్మాటికీ పార్టీకి డ్యామేజ్ అవుతుందన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కీలక నేతలు ఎమ్మెల్యే మల్లారెడ్డితో మాట్లాడినట్టు సమాచారం. మొత్తానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి శనివారం మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేశారు.

 

ఇప్పటికైతే ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యవహారం సద్దుమణిగిందని కారు పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి ఎన్నికల తర్వాతైనా మల్లారెడ్డి కారు పార్టీలో ఉంటారా? లేక ఉక్కపోస్తుందని దిగేస్తారా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *