గాజు గ్లాసు గుర్తు పై బిగ్ ట్విస్ట్.. కూటమిలో కొత్త టెన్షన్..!!

ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీల అధినేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైన వేళ..పార్టీలు కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి. ఇదే సమయంలో కూటమికి కొత్త సమస్య ఏర్పడింది. జనసేన బరిలో ఉన్నచోటే ఆ పార్టీకి గ్లాసు గుర్తు దక్కనుంది. మిగిలిన చోట్ల స్వతంత్రులకూ ఇచ్చే చాన్సు ఉంది. ఇదే జరిగితే ఎన్డీయే అభ్యర్థులకు చిక్కులు తప్పవనే వాదన మొదలైంది.

 

గుర్తు పై కొత్త సమస్య ఏపీలో మూడు పార్టీల కూటమికి కొత్త సమస్య ఎదురైంది. జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కూడా అందుబాటులో ఉంచడం గందరగోళానికి కారణమవుతోంది. జనసేనకు గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా ఇవ్వడాన్ని హైకోర్టు అనుమతించింది. కానీ ఆతర్వాత మరో సమస్య తెర మీదకు వచ్చింది. జనసేన పోటీ చేస్తున్న చోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయిస్తారు. ఆ పార్టీ అభ్యర్థులు లేనిచోట స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా కోరుకుంటే వారికి ఈ గుర్తు ఇచ్చే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లు కోరుకోవడానికి వీలుగా కొన్ని గుర్తులను ఫ్రీ సింబల్స్‌ పేరిట ఎన్నికల కమిషన్‌ ముందే ప్రకటించింది. అందులో గాజు గ్లాసు గుర్తు ఉంది.

 

స్వతంత్రులకు గాజు గ్లాసు జనసేన అభ్యర్థులు లేనిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు అడిగితే ఈ గుర్తు కేటాయిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం స్పష్టం చేసింది. కూటమిలో భాగస్వామిగా జనసేన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లకు పోటీ చేస్తోంది. మిగిలినచోట్ల ఆ పార్టీ మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ బరిలో ఉన్నాయి. జనసేన అభ్యర్థులు లేనిచోట గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే తాము నష్టపోతామని ఈ రెండు పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ గుర్తు చూసి స్వతంత్ర అభ్యర్థులకు ఓట్లు వేస్తే తమకు రావలసిన ఓట్లు తగ్గిపోతాయని అంటున్నారు. ఈ పార్టీలకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ.. జనసేన పోటీ లేని స్థానాల్లో తమకు కావలసిన వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించి, వారికి గాజు గ్లాసు గుర్తు ఇస్తే నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

 

కూటమి నేతల ప్రయత్నాలు జనసేన పోటీ చేసే స్థానాల్లో ప్రధానంగా ఈ వ్యవహారం సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది.కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వాళ్లు తమ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ప్రచారం చేసుకుంటారు. అదే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో టీడీపీ, జనసేన పోటీచేసే అసెంబ్లీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు వస్తే పరిస్థితి ఏమిటనేది చర్చగా మారింది. ఈ సమస్యను ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి జనసేన నాయకులు తీసుకెళ్లారు. నిర్ణయం వెలువడాల్సి ఉంది. దీంతో..ఇప్పుడు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్దులకు కేటాయించకుండా నిర్ణయం వస్తుందా రాదా అనేది ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *