కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్, దమ్ముంటే టచ్ చేసి చూడు..

గులాబీ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. కేసీఆర్.. నీకు దమ్ముంటే ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడాలన్నారు. ఎమ్మెల్యేలకు ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి అని, వాళ్లని ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు.

 

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో మాట్లాడారు. కారు.. షెడ్డు నుంచి బయటకు రాదని పాడైపోయిందన్నారు సీఎం రేవంత్. పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా అని ప్రశ్నించారు. పార్లమెంటులో నిద్రపోవడానికి బీఆర్ఎస్‌కు ఓటు వేయాలా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.

 

CM Revanth Reddy strong counter on kcr comments on mla issue

CM Revanth Reddy strong counter on kcr comments on mla issue

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం మూడునెలలు మాత్రమే అయ్యిందని, పిట్టల దొరకు తాతయ్యగా కేసీఆర్ తయారయ్యారని విమర్శించారు. పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. 2009లో కేసీఆర్‌ను కరీంనగర్ ప్రజలు తరిమికొట్టారని, అక్కడి నుంచి పాలమూరుకు వచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక పాలమూరుకు కేసీఆర్ చేసిందేంటని సూటిగా ప్రశ్నించారు.

 

పనిలోపనిగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణపైనా విరుచుకుపడ్డారు. పదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఢిల్లీలో మోడీ, గల్లీలో కేసీఆర్ పాలనను చూశామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని, తమను ఓడించేందుకు ప్లాన్ చేస్తున్నాయని ఆరోపించారు. లక్ష మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

 

గురువారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవకముందే ఎమ్మెల్యేలు, కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని గులాబీ బాస్‌కు ఊహించని ఝలక్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *