ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ నమోదు చేసిన కేసులో శరత్ చంద్ర రెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారినట్లు సీబీఐ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
ఆ మేరకు ఈ రోజు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు 164 సెక్షన్ కింద శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో గతంలో ఈడీ కేసులోనూ శరత్ చంద్ర రెడ్డి అప్రూవర్ గా మారి పలు కీలక విషయాలను వెల్లడించారు.
ఇప్పుడు సీబీఐ కేసులోనూ శరత్ చంద్రారెడ్డి అప్రూవల్ గా మారడం కీలకంగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ, దినేష్ అరోరాలు అప్రూవర్లుగా మారారు.
తెలంగాణలో భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారాల్లో శరత్ చంద్రారెడ్డిని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెదిరించారని ఇప్పటికే సీబీఐ ఆమెపై అభియోగాలు మోపింది. దీంతో ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో కవితకు సంబంధించిన పలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.