ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా భారీ సభలకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ బస్సు యాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్తున్నారు. రోజుకు రెండేసి నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. తాజాగా కూటమి ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ముఖ్యంగా నాలుగు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
భారీ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా అనకాపల్లిలో భారీ సభ జరగనుంది. తర్వాత రాజమండ్రి, కడప మరొకటి వేదిక ఖరారు కావాల్సి ఉంది. అయితే తేదీలు మాత్రం ఖరారు కావాల్సివుంది. చాలా ప్రాంతాల్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఆ షెడ్యూల్ చెక్ చేసి అప్పుడు తేదీలను ప్రకటించనున్నారు.
ఇక చంద్రబాబు, పవన్‌కల్యాణ్ వరుసగా రోడ్ షోలు, సభలకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో కలిసి రోడ్ షోలకు హాజరయ్యారు. ఇందులోభాగంగా ఈనెల 23న నెల్లిమర్ల, విజయనగరం, 24న రైల్వేకోడూరు, రాజంపేట ఎన్నికల ప్రచారంలో సంయుక్తంగా పాల్గొంటారు.
ఇక చంద్రబాబు 20న గూడూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో రోడ్ షోలకు హాజరుకానున్నారు. తాము అధికారంలోకి రాగానే చేయబోయే కార్యక్రమాలు, మేనిఫెస్టోలోని కీలక అంశాలను వెల్లడించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.