న్యూ ఢిల్లీ : వలస కూలీల విషయంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు సూచనలు చేసింది. రాష్ట్ర పరిధిలోని వలస కూలీలు అదే రాష్ట్రంలోని వేరే ప్రాంతంలో ఉంటే.. వారికి స్క్రీనింగ్ చేసి సొంతూళ్లకు పంపవచ్చని కేంద్రం పేర్కొంది. అలాగే స్వరాష్ట్రంలోని పనిచేసే ప్రాంతాలకు కూడా అనుమతించవచ్చని తెలిపింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతాలకు వలస కూలీలను అనుమతించరాదని స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివారం లేఖ రాశారు. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. కంటైన్‌మెంట్ జోన్‌ల అవతల సోమవారం నుంచి పనిచేసే పరిశ్రమలు, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, నిర్మాణ పనులు, వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పనుల్లో పనిచేసే కూలీలు, వర్కర్లను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.
► కూలీలను సొంతూళ్లకు లేదా పనిచేసే ప్రాంతాలకు పంపించే సమయంలో బస్సుల్లో తగిన భౌతిక దూరం పాటించాలి. కూలీలను తరలించే బాధ్యత స్థానిక అధికార యంత్రాంగం తీసుకోవాలి. బస్సు ప్రయాణ సమయంలో కూలీలకు స్థానిక అధికార యంత్రాంగం ఆహారం, నీటి సౌకర్యం కల్పించాలి.
► ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలు ఎక్కడ ఉంటే అక్కడనే ఉండాలి. రాష్ట్రాల మధ్య వలస కూలీల రవాణాకు అనుమతించరాదు.
► ప్రస్తుతం సహాయ శిబిరాలు, షెల్టర్లలో ఉన్న వలస కూలీల వివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం నమోదు చేసుకోవాలి. కూలీల పని నైపుణ్యాలు తెలుసుకుని అక్కడే తగిన పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.