రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో పోలీసులు కీలక ముందడుగు వేశారు. జగన్ పై రాయి దాడి కేసులో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని కోర్టులో హాజరుపరిచారు.
సీఎం జగన్ పై రాయి దాడికి పాల్పడిన నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇరువర్గాల వాధనలు విన్న ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేసులో పోలీసులు నిందితుడిగా గుర్తించిన సతీష్ .. మైనర్ అని అతని తరఫు న్యాయవాది సలీం కోర్టులో వాదించారు.
రాయి విసిరితే అది హత్యాయత్నం కేసు కిందకు ఎలా వస్తుంది అని ప్రశ్నించారు. 307 సెక్షన్ సతీష్ పై వర్తించదని ఆయన కోర్టులో తన వాదన వినిపించారు. సతీష్ కు ఇప్పటి వరకు ఎటువంటి నేర చరిత్ర లేదని న్యాయవాది సలీం కోర్టుకు తెలిపారు. పోలీసులు కోర్టులో సమర్పించిన పుట్టిన తేదీలకు, ఆధార్ లో ఉన్న పుట్టిన తేదీకి మధ్య తేడా ఉందన్నారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం.. మున్సిపల్ అధికారులు సమర్పించిన ధ్రువపత్రాన్ని మాత్రమే తాము పరిగణలోకి తీసుకుంటామని వెల్లిడించింది. దీంతో నిందితుడు సతీష్ కు మే 2వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
సీఎం జగన్ పై దాడి కేసులో సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే వ్యక్తిని విజయవాడ అజిత్‌సింగ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సతీష్ ను ఏ1 గా గుర్తించారు. తానే జగన్ పైకి రాయిని విసిరినట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో వెల్లడించారు.
సతీష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా కోర్టులో హాజరుపరిచారు. కాగా, ఈ కేసులో పోలీసులు ఇప్పటికే వడ్డెర కాలనీకి చెందిన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే ఈ కేసులో సతీష్ ను 17వ తేదీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు కోర్టులో నివేదించిన రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఏ2 ప్రోత్సాహంతోనే నిందితుడు సతీష్ సీఎం జగన్ పై దాడికి పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. గత వారం రోజులుగా ఆ ప్రాంతంలో జరిపిన ఫోన్ సంభాషణలు ఆధారంగానే సతీష్ ను అదుపులోకి తీసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కోర్టుకు తెలిపారు.
కాగా, సీఎం జగన్ పై దాడి కేసులో విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఆ ఆరుగురి అనుమానితుల వివరాలను వెల్లడించాలంటూ న్యాయవాది సలీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై న్యాయవాది కమిషనర్ ను నియమించాలని కోర్టులో కోరారు.