ఏపీలో ఎన్నికల తొలి అంకం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, లోక్‌సభకు ఒకేసారి నోటిఫికేషన్ వెలువడనుంది. 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్‌సభ స్థానాలకు గురువారం ఉదయం నోటిఫికేషన్ వెలువడనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవుతుంది. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్ పత్రాలను సమర్పించాల్సి ఉంది.
శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులు 10వేలు, లోక్‌సభ అభ్యర్థి 25వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులయితే 50శాతం చెల్లిస్తే సరిపోతుంది. అయితే నామినేషన్ల స్వీకరణకు కేవలం వారం రోజులు మాత్రమే.. అంటే ఈనెల 25తో ముగియనుంది. పత్రాల పరిశీలన 26 వరకు మాత్రమే ఉంటుంది. ఉపసంహరణకు గడువు ఈనెల 29వరకు అవకాశం ఉంది. పోలింగ్ మే 13న శాసనసభ, లోక్‌సభకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ నాలుగున జరగనుంది.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు వరకు మాత్రమే నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. ఇక నామినేషన్లకు అభ్యర్థులు 13 రకాల పేపర్లను తీసుకురావాల్సి ఉంటుంది. వీటితోపాటు కొత్త బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి రెండు కంటే ఎక్కువ సీట్లలో నామినేషన్లు వేయడం కుదరదు. అభ్యర్థి సహా ఐదుగురిని మాత్రమే నామినేషన్ల ఆఫీసులోకి అనుమతిస్తారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన నాటి నుంచి అభ్యర్థి చేసే ఖర్చు లెక్కలోకి వస్తుంది.
ఇప్పటికే ప్రధాన పార్టీలైన అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ పార్టీలు తమతమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. ప్రచారం కూడా మొదలుపెట్టారు. నామినేషన్లకు ఏ రోజు మంచిదని ఇప్పటికే పండితుల వద్ద డీటేల్స్ తీసుకున్నారు అభ్యర్థులు. అదే రోజు సరిగ్గా అన్ని గంటలకు నామినేషన్లను దాఖలు చేయనున్నారు.