జనసేన పార్టీ నుంచి ఏపీ అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అధినేత పవన్ కల్యాణ్ బీ-ఫారాలు అందజేశారు. 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులకు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో బీ ఫారాలను అందించారు.
నాదెండ్ల మనోహర్ తొలి బీ-ఫారంను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఎంతో నిబద్ధతతో నడిపిస్తున్నారని, ఇబ్బందులు, ఆటంకాలెన్ని ఎదురైనా పార్టీని వదలకుండా నడిపించారన్నారు.
జరగబోయే ఎన్నికల్లో అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కూటమి దెబ్బకు జగన్ సీటు ఖాళీ అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక రేపటి (ఏప్రిల్ 18) నుంచి ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. మే 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఏప్రిల్ 19న టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడి తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ ను దాఖలు చేయనున్నారు.