విజయవాడలో మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా.. ప్రజలకు సీఎం జగన్ అభివాదం చేస్తుండగా.. ఆగంతకులు ఆయనపై రాళ్లు రువ్వారు. దాంతో జగన్ ఎడమ కంటికి పైన గాయమవ్వగా.. వైద్యులు చికిత్స చేసి మూడు కుట్లు వేశారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. మరోవైపు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఎయిర్ గన్ తో షూట్ చేయడంతో దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. దాడి జరిగిన స్కూల్ భవంతిలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
కాగా.. సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి.. నెట్టింట జోకులు పేలుతున్నాయి. టిడిపి నేతలైతే ఇది కావాలని ఆయనకు ఆయనే చేయించుకున్నదాడిలా ఉందంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల ప్రచారంలో.. అందులోనూ సీఎం ప్రచారంలో కరెంట్ ఎందుకు పోయినట్లని ప్రశ్నిస్తున్నారు. పైగా గాయమయ్యాక బస్సు చుట్టూ ఉన్న జనాలను కూడా పోలీసులు కంట్రోల్ చేయకుండా వదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఆగంతకుడే దాడి చేస్తే.. వెంటనే అప్రమత్తమై సీఎంను ఆస్పత్రికి తరలించకుండా.. బస్సులోనే మూడుసార్లు ట్రీట్మెంట్ చేయడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నెట్టింట ఒక వీడియో వైరల్ అవుతోంది. అది కొడాలి నాని గతంలో మాట్లాడిన వీడియో. కానీ.. ఇప్పుడు జరిగిన దాడికి సింక్ అయ్యేలా ఆ వ్యాఖ్యలు ఉండటంతో.. టిడిపి X వేదికగా తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. మరిన్ని జోకులు పేలుస్తున్నారు. ఇంతకీ కొడాలి నాని ఆ వీడియోలో ఏం మాట్లాడారంటే.. “పర్యటనకు వెళ్తుంటే.. ఎంతమంది పోలీసుల పహారాలో అతని యాత్ర జరుగుతుంది ? ఎవడో చీకట్లో రాయి విసిరాడంట ఈయన మీదికి. ఈయన్ను చంపేద్దామని. అది కూడా గులకరాయి. ఈయనేమైనా పావురమా? పిట్టా? గులకరాయి పెట్టి కొడితే పోవడానికి. పక్కింటి హీరోని తీసుకొచ్చి అందలమెక్కాలని చూస్తున్నావ్ కాబట్టి నీ తాలూక ఎవడో విసిరుంటాడు. ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్లు వేయించుకోవడం.” ఇది కొడాలి నాని ఆ వీడియోలో మాట్లాడిన మాటలు. ఇప్పుడిదే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
“అంత గురిచూసి కొట్టాడంటే ఆడుదాం ఆంధ్రలో ప్లేయర్ అయి ఉంటాడు.” అని ఒక నెటిజన్.. “గుట్కా మహత్యమో ఏమో తెలీదు కానీ కొన్ని సార్లు భూత వర్తమాన కాలాల గురించి గుట్కా నోట నిజాలు అలా ఆణిముత్యాల్లా బయటికి వస్తుంటాయి. అవి ఏరుకుని దాచి పెట్టుకుంటే అవసరమైనప్పుడు బయటికి తీసి క్యాష్ చేసుకోవచ్చు. నాని నోటమాట నిజమైన వేళ..” అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ఇంకొక నెటిజన్ అయితే.. మార్కెట్ లో గాయాలైనట్లు ఉండే రెడీమేడ్ స్టిక్కర్లు, మేకప్ లు దొరుకుతున్నాయని ఏకంగా ఒక మేకింగ్ వీడియోనే పెట్టాడు.
సీఎం జగన్ పై దాడి జరుగుతుందని ఆ పార్టీ నేతలకు ముందే తెలుసంటున్నారు. అవుతు శ్రీధర్ రెడ్డి నాలుగు రోజుల క్రితం చేసిన ట్వీట్ కూడా ఇప్పుడూ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ లో “బిగ్ బ్రేకింగ్ న్యూస్. నాలుగురోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం? ఎన్నికల మూడ్ నే మార్చేసే సంఘటనలు ?” అని రాసుకొచ్చారు. దీనిని బట్టి ఇదంతా వైసీపీనే కావాలని ప్లాన్ చేసిందని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే శ్రీధర్ రెడ్డి మాత్రం ఇదంతా టిడిపి మార్ఫ్ చేసిన ట్వీట్ అని, తాను అలా చేయలేదని చెబుతున్నారు. ఏపీ డీజీపీ దీనిపై సమగ్ర విచారణ చేయాలని కోరారు.