వైసీపీ సర్కార్‌పై మాటల దాడిని తీవ్రతరం చేసింది టీడీపీ కూటమి. దొరికిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుని విమర్శలు ఎక్కుపెడుతోంది. తాజాగా బాలకృష్ణ కూడా తనదైన శైలిలో సినిమా డైలాగ్స్‌ను జత చేస్తూ సీఎం జగన్‌పై ఆరోపణలు సంధించారు. తాజాగా ఒక్క అవకాశం అంటూ వచ్చినోడి కుర్చీ మడత పెట్టే సమయం వచ్చేసిందని సెటైర్లు వేశారు.
గతంలో ఇదే డైలాగ్‌ను టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తావించారు. ఫిబ్రవరిలో విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ శంఖారావం సభలో అప్పుడు నారా లోకేష్ కుర్చీ మడత పెట్టి చూపించారు. అప్పట్లో అది చాలా పాపులర్ అయ్యింది. దీనిపై వైసీపీ నేతలు బాగానే నొచ్చుకున్నారు కూడా. అదే డైలాగ్‌ను లోకేష్ మామ బాలకృష్ణ దాన్ని సినిమా స్టయిల్‌లో చెప్పుకొచ్చారు. మొత్తానికి అల్లుడి కాన్సెప్ట్‌ను మామ ఎత్తుకుని ఓటర్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారని కేడర్ చెబుతున్నమాట.
ఫ్యాన్ రెక్కలను ప్రజలు మూడుముక్కలు చేయడం ఖాయమన్నారు బాలకృష్ణ. రేపటిరోజు గెలుపు మనదేనని మనసులోని మాట బయటపెట్టారు. ఐదేళ్లలో అనంతపురానికి వైసీపీ సర్కార్ ఏం చేసిందని దుయ్య బట్టారు. ఎమ్మెల్యేలు ఇసుక, మట్టిని దోచుకోవడం తప్ప ఏనాడూ ప్రజల కోసం పని చేయలేదని ధ్వజమెత్తారు. స్వర్ణాంధ్ర సాకార బస్సుయాత్రలో భాగంగా రెండోరోజు శింగనమల, కల్లూరు, అనంతపురం నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు బాలకృష్ణ.
టీడీపీ రూలింగ్‌లో ఉన్నప్పుడు ఇక్కడకు కియో కార్ల కంపెనీ తీసుకొచ్చిన ఘనత టీడీపీకే చెందుతుంద న్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయని ప్రశ్నించారు. ఇక్కడ యువతకు ఉపాది దొరికిందా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఓటర్లను కోరారు.