తెలంగాణ, ఏపీకి నీటి కేటాయింపులు, మరోసారి భేటీ..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రం కావడంతో తాగునీటికి పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కృష్ణాబోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటి అవసరాల కోసం నాగార్జున‌సాగర్ నుంచి తెలంగాణ 8.5 టీఎంపీలు, ఏపీకి 5.5 టీఎంసీలు తీసుకునేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

హైదరాబాద్‌లోకి జలసౌధలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణకు కేటాయించిన 11 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకుందని ఏపీ ఆరోపణ చేసింది. తెలంగాణ పరిధిలో రెండు కోట్ల మందికి తాగునీటి అవసరాలు ఉన్నాయని వాదించగా, ఏపీలో 17లక్షల జనాభాకే నీరు అందాల్సి ఉందని తెలంగాణ గుర్తు చేసింది.

 

చివరకు ఏపీ 14 టీఎంసీలు, తెలంగాణ 10 టీఎంసీలు కావాలని చేసిన డిమాండ్ కమిటీ తోసిపుచ్చింది. రిజర్వాయర్లు లేని కారణంగా గతేడాది క్యారీ ఓవర్ కింద ఉన్న 18 టీఎంసీలు ఉండిపోయాయని తెలంగాణ అధికారులు తెలిపారు. ఏపీకి మాత్రం పెన్నా బేసిన్‌కు తరలించి నీటిని నిల్వ చేసుకుందని ఆరోపించింది. శ్రీశైలం నుంచి దిగువకు నీటిని వదులుదామని బోర్డు సభ్యుడు శంఖ్వా ప్రతిపాదించారు.

 

తాగునీటి అవసరాల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచన చేసింది. మే నెల వరకు రెండు రాష్ట్రాలు 14 టీఎంసీల నీటిని వినియోగించుకోనున్నాయి. ఇంకా మిగులు మూడున్నర టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించారు. అంతేకాదు మే నెలలో మరోసారి ఈ కమిటీ భేటీ కానుంది. అప్పటి పరిస్థితులను అంచనా వేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *