టీడీపీ అధినేత, చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు భేటి అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ పురందేశ్వరీతో పాటుగా ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో, తదుపరి ఎన్నికల ప్రచారం, భవిష్యత్ కార్యచరణ, క్షేత్రస్థాయిలో చేయవాల్సిన పనులు, పార్టీ నేతల బుజ్జగింపు, కొన్ని స్థానాల్లో మార్పులు, చేర్పులపై కూడా ఈ కూటమి సమావేశంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా సరే తీరు మారని అధికారులపై కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది. పెన్షన్ల పంపిణీ విషయంలో వారు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేయాలని కూటమి నేతలు నిర్ణయించారు. ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేసి.. నిరంతరం ఈసీ అధికారులతో టచ్ లో ఉంటాలని చంద్రబాబు, పవన్ సూచించారు.
కూటమి గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయి పార్లమెంట్ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఎన్డీఏ నేతలు నిర్ణయించారు. ప్రచారం, ఎన్నికల నిర్వహణ, వ్యూహాలపై రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించాలని కూటమి నేతలు నిర్ణయించారు. కూటమి తరఫున రాష్ట్రంలో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లాంటి అగ్రనేతలతో ఎన్నికల ప్రచారం చేయించాలని ప్రణాళికలు మొదలుపెట్టాలని నిర్ణయానికి వచ్చారు.
ఎన్డీఏ కూటమి నేతల భేటిలో ఒకట్రెండు స్థానాల్లో మార్పులు చేర్పులు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని స్థానాల్లో కూటమి నేతలపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అనపర్తి, ఉండి, తంబళ్లపల్లె వంటి స్థానాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఓట్లు చీలకుండా సీట్ల సర్ధుబాటు ఉండాలని కూటమి అభిప్రాయపడింది. దీనికోసం ఢిల్లీ నేతలతో కూడా సంప్రదింపులు జరిపి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ అగ్రనేతల పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్లు విషయంలో కూడా త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశా ఉన్నట్లు తెలుస్తోంది.