మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్లలో నిర్వహించిన ప్రజాగళం సభలో రాజధాని వ్యవహారంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఏపీకి మొండెం ఉంది కానీ.. తల లేకుండా పోయిందని అన్నారు. రాజధాని లేని రాష్ట్రం, తల లేని మొండెం ఒక్కటేనని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నుంచి పన్నలతో సమాన్య ప్రజలపై అధిక భారం మోపుతుందన్నారు.
జగన్ ప్రజలకు రూ.10 ఇచ్చి.. రూ.100 తీసుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో కొందరు మంచివారు, మరి కొందరు రౌడీలు ఉన్నారన్నారు. జగన్ ఎన్నికల ప్రచారం కోసం ఒక్కో మీటింగ్ కు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఉపాధి కోసం హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుకు వెళ్తున్నారని.. అదే అమరావతి పూర్తి అయితే ఇక్కడే యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును ఎంత పూర్తి చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరింగిందని.. నాసిరకం మద్యం తాగడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.
వైసీపీ మీటింగ్ కు వెళ్లకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతలకు జగన్ అపాయింట్ మెంట్ దొరకని పరిస్థితి నెలకొందని.. అదే టీడీపీ పాలనలో ప్రజలు నేరుగా తమ ఇంటి వద్దకే వచ్చేవారని గుర్తు చేశారు. దళిత వ్యక్తిని హత్య చేసిన వ్యక్తిని జగన్ పక్కన పెట్టుకుని ఊరేగితున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహిస్తోందని విరుచుకుపడ్డారు.