హంతకులకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నందుకే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వెల్లడించారు. జగన్ సీఎం అయ్యాక తనతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాలని అన్నారు. హత్యలు చేసిన వారిని జగన్ కాపాడుతున్నారని మండిపడ్డారు.
కడప స్థానంలో అవినాష్ రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అందుకే తమ పర్యటనలను అడ్డుకుంటున్నారని, జెండాలు తొలిగిస్తున్నారని అన్నారు. వారు ఎంత అరచినా.. తమకేం అభ్యంతరం లేదన్నారు. తాను ఒకప్పుడు జగన్ చెల్లలు కాదని.. వైఎస్సార్ బిడ్డనని అన్నారు. జగన్ సీఎం అయ్యాక తనతో పరిచయం లేదన్నారు.
‘జగన్ బాబాయిని చంపిన వారికే టికెట్ ఇచ్చారు. ఇది ఒక కుటుంబ విషయం కాదు.. ప్రజా నాయకుడు వివేకా హత్య కేసుకు సంబంధించిన విషయం. అవినాష్ అంటే నాకు గతంలో కోపం లేదు.. అతడు హంతకుడని సీబీఐ తేల్చి, అన్ని ఆధారాలు భయటపెట్టింది. జగన్ బాబాయిని చంపిన హంతకులకు అండగా నిలబడినందుకే నేను కడప ఎంపీగా పోటీ చేస్తున్నాను. హంతకులు చట్టసభల్లోకి వెళ్లకూడదనేదే నా నిర్ణయం.
జగన్ పులివెందుల పులి కాదు.. పిల్లి. జగన్ బీజేపీకి బానిస. మీ ఆడ బిడ్డను కొంగుచాచి అడుగుతున్నా.. కడపలో నన్ను గెలిపించండి.
న్యాయం, ధర్మం ఓ వైపు.. అధర్మం, హంతుకులు మరో వైపు ఉన్నారు. అల్లరి చేసే వాళ్లు పులివెందులకు రండి.. పూల అంగళ్ల వద్ద పంచాయితీ పెదడాం. వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం’ అని సవాల్ చేశారు. తాను వైఎస్సార్ బిడ్డనని మరిచిపోవద్దని.. తన ప్రచారంలో అల్లర్లు సృష్టిస్తున్న వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా, కడప జిల్లా లింగాలలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ నేతలు గొడవకు దిగారు. జగన్ కు అనుకూలంగా వైసీపీ జెండాలు పట్టుకుని, నినాదాలు చేశారు. దీంతో వైసీపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని అల్లరి మూకలను చెదరగొట్టారు. దీంతో గొడవ సద్దిమణిగింది.