ఢిల్లీ లిక్కర్ కేసు రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ లు.. వీరిపై ఈడీ విచారణ, కోర్టు కీలక తీర్పులతో మలుపులు తిరుగుతోంది. అయితే మరోసారి కవితకు కోర్టులో చుక్కెదురైంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆమె సీబీఐ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో తక్షణం ఎలాంటి ఉపశమనం ఇవ్వలేమని ప్రత్యేక జడ్డి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ కేసు గురించి తనకు ఎలాంటి విషయాలు తెలియలేదని.. తన ఎదుట దీనికి సంబంధించిన ఎలాంటి విచారణ జరగలేదని జడ్జి మనోజ్ కుమార్ వెల్లడించారు.
తన ఎదుట అత్యవసర వాదనలు మాత్రమే జరగుతాయని న్యాయవాది మనోజ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం రెగ్యులర్ కోర్టులో దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని కవిత తరపు న్యాయవాదికి సూచించారు. కాగా, మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి.. తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.
అయితే సీబీఐ తమకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. దీంతో కవిత తరపు న్యాయవాది మెహిత్ రావు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఆమెను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా, శుక్రవారం కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.
ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 6వ తేదీన ప్రశ్నించారు. అయితే విచారణలో సమయంలో కవిత సీబీఐ అధికారులకు సహకరించకపోవడం, ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండడంతో వారు ఆమెను అరెస్ట్ చేశారు. కాగా, లిక్కర్ పాలసీ కేసులో రూ.100 కోట్లు అవినీతి జరిగిందంటూ.. అవినీతి ఆరోపణ కేసులో ఈడీ అధికారులు కవితన మార్చి 15న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.