ఏపీసీసీ అధ్యక్షురాలు.. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల అన్నను ఓడించటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం బుధవారం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలవటమే. ఆయనతో పాటు ఆయన సోదరుడు బెంగళూరు రూరల్ అభ్యర్థి డీకే సురేష్ కూడా ఉన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడిని డీకే శివకుమార్.. ఏపీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపుతారని షర్మిల నమ్ముతోన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్నికల ప్రచారానికి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. నిన్న(ఏప్రిల్ 10) బెంగళూరులోని ఆయన నివాసంలో కలిసిన షర్మిల.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి రావాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని సమాచారం.
ఇప్పటికే ఆపరేషన్ కర్ణాటక, ఆపరేషన్ తెలంగాణ విజయంతంగా పూర్తి చేసిన డీకే.. ఇప్పుడు ఆపరేషన్ ఏపీ మీద ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. పోయిన దగ్గరే వెతుక్కోవాలంటారు. ఆ ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్ హవా అంతాఇంతా కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌లో అస్థిత్వం కోల్పోయింది. కాగా వైఎస్సార్ కూతురుగా వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలందుకోవడంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఏపీలో పురుడుపోసుకుంది. ఇటీవలే ఆ పార్టీలోకి వలసలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో రెండు శాతం ఓటు బ్యాంకు సాధించినా అది అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.
ఇక ఇప్పటికే రెండు జాబితాల్లో 126 అసెంబ్లీ స్థానాలకు, 11 లోక్‌సభ స్థానాలకు రెండు విడతల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అన్నను ఓడించాలని దూకుడుగా ఉన్న షర్మిల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో జూన్ 3 వరకు వేచి చూడాల్సిందే.