ఢిల్లీ మద్యం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేయని ప్రయత్నాలు లేవు. ప్రతీవారం ఏదో ఒక పిటీషన్ న్యాయస్థానంలో దాఖలు చేస్తున్నారు. తాజాగా తనను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.
కవిత దాఖలు చేసిన పిటీషన్‌పై సమాధానం ఇవ్వాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది ప్రత్యేక న్యాయస్థానం. కవితను ప్రశ్నించడంపై రిప్లై దాఖలు చేయడం లేదని సీబీఐ తెలిపింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కవిత తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. మళ్లీ ప్రశ్నించాల్సి వస్తే ముందే తమకు సమాచారం ఇవ్వాలని సీబీఐని కోరినట్టు చెప్పారు. ఇదే విషయాన్ని ఆమె తరపు న్యాయవాదులకు సూచించారు న్యాయమూర్తి.
సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై వాదనలు వినిపిస్తామన్నారు కవిత తరపు న్యాయవాదులు. దీంతో తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. తీహార్ జైలులో ఉన్న కవితను విచారించేం దుకు శుక్రవారం సీబీఐ అనుమతి తీసుకుంది. షరతులతో కూడి పర్మీషన్ న్యాయస్థానం మంజూరు చేసింది. ఆమెను ప్రశ్నించేందుకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సీబీఐ సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.
విచారణ సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు పెట్టింది. ఆమెని ప్రశ్నించే సమయంలో ల్యాప్ టాప్, ఇతర స్టేషనరీ తీసుకొచ్చేందుకు సీబీఐకి ఓకే చెప్పింది. అయితే సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ శనివారం పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఇదిలావుండగా తనను జైలులోనే సీబీఐ ప్రశ్నించిందని మంగళవారం కోర్టుకు హాజరైనప్పుడు కవిత వెల్లడించారు.