ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ.. అధికార పార్టీకి చెందిన నేతలు ఎవరు, ఎప్పుడు జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సింగనమలకు చెందిన కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు హిందూపురం వంతైంది.
వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. ఇక్బాల్ టీడీపీలోకి వెళ్లడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఈసారి హిందూపురం నుంచి పోటీ చేయాలని భావించారాయన. వైసీపీలో గ్రూపులు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. నాలుగైదు వర్గాలు ఏర్పడ్డాయి. ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించుకోవడంతో వైసీపీ హైకమాండ్‌కి పెద్ద తలనొప్పిగా మారింది.
ఇక్బాల్ హిందుపూర్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య జరిగింది. ఆ తర్వాత నవీన్ నిశ్చల్ కూడా ఎమ్మెల్యే సీటు కోసం పోటీపడ్డారు. ఈ క్రమంలో సీటు ఎవరికి కేటాయించాలన్న దానిపై వైసీపీ తర్జనభర్జన పడింది. చివరకు వైసీపీలో ద్వితీయశ్రేణి నేతగా ఉన్న వేణుగోపాల్‌రెడ్డి భార్య దీపికను ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించింది. ఆమె కురుబ సామాజికవర్గం కాగా, భర్త రెడ్డి కమ్యూనిటీకి చెందినవారు. దీంతో ఇరువర్గాలకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
వైసీపీలో జరుగుతున్న పరిణామాలను గమనించిన అక్కడి నేతలు వలస పోతున్నారు. ఈ క్రమంలో ఇక్బాల్ టీడీపీ గూటికి చేరుకున్నారు. ఒక్కసారి నియోజకవర్గం హిస్టరీలోకి వెళ్తే.. టీడీపీ ఆవిర్భావం మొదలు మొన్నటివరకు వరుసగా సైకిల్ పార్టీ గెలుస్తూ వచ్చింది. మరో పార్టీకి అక్కడ ఛాన్స్ ఇవ్వలేదు ఓటర్లు. ఎన్టీఆర్ మూడుసార్లు గెలుపొందగా, బాలకృష్ణ రెండుసార్లు విజయం సాధించారు. ఈసారి గెలిచి ఎన్టీఆర్ రికార్డు సమం చేయాలని భావిస్తున్నారు బాలయ్య.
2019 ఎన్నికల్లో వైసీపీ తరపున హిందూపురం అభ్యర్థిగా ఇక్బాల్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అయినా గ్రూపు రాజకీయాలు ఆయన్ని చాలా ఇబ్బందిపెట్టాయి. ఈ క్రమంలో వైసీపీ రాజీనామా చేశారు. ఎన్నికల వేళ ఇక్బాల్.. టీడీపీలోకి రావడంతో బాలకృష్ణ విజయం సునాయాశమవుతుందని తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు.