ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏపీలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నేతలు పూర్తిగా ప్రజలతో మమేకమయ్యారు. ఓ వైపు సభలు, మరోవైపు రోడ్ షోలతో దూసుకుపోతున్నారు. మార్చిలో కూటమి ఏర్పాటు చేసిన సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. తాజాగా బుధవారం తణుకు, నిడదవోలు కూటమి సభలు జరగనున్నాయి. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరుకా నున్నారు.
ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ముఖ్యనేతలు సంయుక్తంగా హాజరవుతున్న సభలు ఇవే. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సాయంత్రం నాలుగు గంటలకు నిడదవోలులో రాత్రి ఏడుగంటలకు సభలు జరగనున్నాయి. గురువారం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట, అమలాపురంలో సభలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇద్దరు నేతలు తొలుత విజయవాడ నుంచి హెలికాఫ్టర్లలో తణుకు చేరుకుంటారు. సభ తర్వాత రోడ్డు మార్గాన చంద్రబాబు, పవన్ కలిసి నిడదవోలు చేరుకో నున్నారు. అక్కడ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొంటారు.
ఈ జిల్లా నుంచి రెండు సభలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యేలా కూటమి నేతలు ప్లాన్ చేశారు. అయితే కూటమి మేనిఫెస్టోపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా మహిళల పింఛన్లు, వాలంటీర్లకు నెలకు 10వేల రూపాయలు హామీలను ఇందులో పొందుపరిచే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల మూడోవారంలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కావచ్చని చెబుతున్నారు