ఒకప్పుడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ అనగానే టక్కున పూరి జగన్నాధ్ పేరు చెప్పేసేవారు. ఇప్పుడు ఆయనను మించి ఒక డైరెక్టర్ వచ్చాడు. అతనే సందీప్ రెడ్డి వంగా. జనరేషన్ ను, తుప్పుపట్టిన ప్రేక్షకుల మైండ్ సెట్ ను అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా వదిలించేశాడు. ఇక అనిమల్ సినిమాతో అసలు డైరెక్టర్ అంటే వీడేరా.. అనిపించేలా చేశాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్.. స్పిరిట్ తో రానున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో స్పిరిట్ ఒకటి.
సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ సినిమా అనగానే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది. ఇక దానికి స్పిరిట్ అనే టైటిల్ ను ఖరారు చేసినప్పుడే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ కాప్ గా కనిపించబోతున్నాడు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందో అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది. ఈలోపు ఎక్కడా హైప్ తగ్గకుండా సందీప్.. స్పిరిట్ గురించి మాట్లాడుతూ ఇంకా ఇంకా అంచనాలను పెంచేస్తున్నాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో సందీప్.. ప్రభాస్ గురించి మాట్లాడాడు. ” అనిమల్ కన్నా ముందే స్పిరిట్ ను పూర్తి చేయాల్సింది. కానీ, కుదరలేదు. మొదట ప్రభాస్.. నాతో ఒక హాలీవుడ్ రీమేక్ తీయ్ అన్నాడు. నేను రీమేక్ ఎందుకు ఒరిజినల్ సినిమానే చేస్తా అని స్పిరిట్ కథ వినిపించాను. అది ప్రభాస్ కు బాగా నచ్చింది. ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్తుంది. 60శాతం స్క్రిప్ట్ రెడీ అయ్యింది. స్పిరిట్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని మంచి బజ్ అందుకుంటే.. ప్రభాస్ మార్కెట్ ను బట్టి.. మొదటి రోజే రూ. 150 కోట్లు కలక్షన్స్ అందుకోవచ్చు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సందీప్ మాటలు విన్న ప్రభాస్ ఫ్యాన్స్ అది ప్రభాస్ రేంజ్.. ఖచ్చితంగా ఈసారి బాక్సఫీస్ బద్దలు అవ్వడమే అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ అనిమల్ డైరెక్టర్.. అన్నంతపని చేస్తాడో లేదో చూడాలి.