విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీ.. 100 రోజుల్లో నివేదిక..?

తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై జ్యుడిషియల్ విచారణ మొదలైంది. ఈ క్రమంలో విచారణ కమిషన్ ఛైర్మన్ రిటైర్ న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి అధ్యక్షతన కమిటీ ఆదివారం భేటీ అయ్యింది. ట్రాన్స్ కో-జెన్ కో సీఎండీ రిజ్వీ, ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాసరావుతోపాటు ఇతర అధికారులకు సుమారు రెండు గంటల పాటు ఛైర్మన్ సమీక్ష నిర్వహించారు.

 

అనంతరం మీడియాతో మాట్లాడారు ఛైర్మన్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న సమయంలో నిర్ణయాలు తీసుకున్న అధికారుల అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. అప్పట్లో పని చేసి రిటైరయిన అధికారులకు, నాటి ప్రజా ప్రతినిధులకు వచ్చేవారం లేఖ రాస్తామని చెప్పుకొచ్చారు కమిటీ ఛైర్మన్. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తామన్నారు.

 

ముఖ్యంగా పీపీఏలు చేసుకున్న సమయంలో ఏమైనా పొరపాట్లు జరిగాయా? అందులో భాగస్వాములుగా ఉన్నవారెవరు? ఒకవేళ లోపాలుంటే ఎవరి పాత్ర ఎంత అనే కోణంలో విచారణ జరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రాధమిక పరిశీలన జరుగుతోందన్నారు. అలాగే థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం వల్ల ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడ్డారా అనే విషయాలను కూడా పరిశీలిస్తామన్నారు.

 

వేగంగా విచారణ చేసిన 100 రోజల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. కేసీఆర్ హయాంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్ కొనుగోలు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంపై రేవంత్‌రెడ్డి సర్కార్ జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో కమిటీ ఆదివారం సమావేశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *