ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. తన కొడుకు స్కూల్ ఎగ్జామ్స్ నిమిత్తం తనకు బెయిల్ ఇవ్వాలని కవిత పిటీషన్ దాఖలు చేశారు.
కవిత తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. కవిత అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని వాదనలు వినిపించారు. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని.. అతను భయంతో ఉన్నాడని.. ఈ సమయంలో తల్లి పాత్ర అవసరమన్నారు. దీన్ని ఈడీ తరపు న్యాయవాది తోసిపుచ్చారు. విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వవద్దని తెలిపింది. ముఖ్యంగా కవిత బయటకు వస్తే దర్యాప్తుకు ఆటంకం కలుగుతోందన్నది ఈడీ వాదన.
ఈ కేసులో అప్రూవర్‌గా మారినవాళ్లను కవిత బెదిరించారని, దీనికి సంబంధించి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వాదనల సందర్భంగా ఈడీ న్యాయవాది తెలిపారు. అవసరమైన సందర్భంలో వివరాలు ఇచ్చేందుకు సిద్ధమని తెలిపింది. చివరకు ఈడీ న్యాయవాది వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ వ్యవహారంపై గతవారం విచారణ జరిగింది. ఏప్రిల్ ఎనిమిదిన న్యాయస్థానం తన తీర్పును వెల్లడించింది. ఈడీ సేకరించిన వివరాల ఆధారంగా మధ్యంతర బెయిల్ ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది.
ఈ కేసులో మార్చి 26 నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు కవిత. అయితే న్యాయస్థానం ఏప్రిల్ తొమ్మిది వరకు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆమెను మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటీషన్‌పై ప్రత్యేక కోర్టు ఈనెల 20న విచారణ జరపనుంది.