జనసేన పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ఇచ్చారు. ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బీజీగా మెగాస్టార్ చిరంజీవిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాగబాబు వెళ్లి కలిసారు.
హైదరాబాద్ నగర శివారులో ముచ్చింతల్ లో విశ్వంభర షూటింగ్ జరుగుతుండగా చిరంజీవి సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు వెళ్లి కలిశారు. అయితే జనసేన విజయాన్ని కాంక్షిస్తూ మెగాస్టార్ రూ.5 కోట్ల విరాళం అందించారు. దానికి సంబంధించిన చెక్ లను చిరు జనసేనానికి అందజేశారు.
చిరంజీవి ఆత్మీయ ఆలింగనంతో సోదరులకు స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ వెనుక నేనున్నాంటూ చిరంజీవి భరోసా ఇచ్చారు. ఆ తర్వాతం మెగా సోదరులు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రచార హోరు, తదితర అంశాల గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
“అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. అధికారం లేకపోయినా, తన సంపాదన ని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను” అని చిరంజీవి ట్వీట్ చేశారు.