లక్షల డాలర్ల సహాయం అందించనున్న క్రీడాకారులు

క్రీడా వార్తలు :  కరోనా మహమ్మారి దెబ్బకు టోర్నీల్లేక ఇబ్బందులెదుర్కొంటున్న యువ ఆటగాళ్లకు ఆర్థికంగా చేయూత అందించేందుకు టెన్నిస్‌ దిగ్గజాలు రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) సిద్ధమవుతున్నారు. టెన్నిస్‌లో రాణించాలని కోటి ఆశలతో వచ్చిన కొత్త ఆటగాళ్లకు ప్రస్తుత లాక్‌డౌన్‌ శరాఘాతమైంది. వీరికి ఎలాంటి స్పాన్సర్‌షిప్స్‌ ఉండవు. చిన్నాచితక టోర్నీల్లో ఆడితేనే ప్రైజ్‌మనీల రూపంలో డబ్బు వస్తుంది. లేదంటే లేదు. అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) నుంచి కూడా ఆర్థిక తోడ్పాటు ఉండదు. ముఖ్యంగా 200 ర్యాంకు నుంచి 700 ర్యాంకుల్లో ఉన్న వారికి టోర్నీలు జరగడమే ఇం‘ధనం’. లేదంటే కెరీర్‌ బండి నడవదు. వాళ్లు సొంత డబ్బులతో టోర్నీలకు వెళ్తారు. ఆ టోర్నీలే లేకపోతే వారి కష్టాలు వర్ణనాతీతం. దీన్ని గమనించిన ఈ ముగ్గురు దిగ్గజాలు భవిష్యత్‌ టెన్నిస్‌ తారల కోసం నిధిని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. అంతర్జాతీయ టెన్నిస్‌ ఆటగాళ్ల సంఘానికి అధ్యక్షుడైన జొకోవిచ్‌ మాట్లా డుతూ… ‘మన ముగ్గురం కలిసి 30 నుంచి 45 లక్షల డాలర్లు సమకూర్చితే… ఈ మొ త్తాన్ని తక్కువ ర్యాంకు ఆటగాళ్లకు పంపిణీ చేయవచ్చు’ అని సూచించాడు. భవిష్యత్‌ టెన్నిస్‌ బాగుండాలనే ఈ ప్రతిపాదన తెచ్చినట్లు అతను చెప్పాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో వచ్చిన ప్రైజ్‌మనీతో ఈ నిధిని జమచేయవచ్చని అన్నాడు. ఒకవేళ ఈ సీజన్‌ మొత్తం రద్దయితే ఈ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో దక్కించుకున్న ప్రైజ్‌మనీ నుంచైనా నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు జొకోవిచ్‌ తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *