వైనాట్ వన్ సెవన్టీ ఫైవ్ అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్.. సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా భావిస్తూ తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ దక్కించుకుంటాన్న నమ్మకంతో కనిపిస్తున్నారు. అయితే అంత సీన్ లేదంటున్నారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమి గ్యారంటీ అని తేల్చేశారు. బటన్ పాలిటిక్స్‌ని నమ్ముకున్న జగన్ అభివృద్ధిని అటకెక్కించారని విశ్లేషించారు. పీకే వ్యాఖ్యలపై మంత్రి బొత్స .. వాట్ నాన్సెన్స్.. అంటూ తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని విశ్లేషించారు. ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు. అంతేకాదు జగన్ తనకు తాను రాజాగా భావిస్తున్నారని.. ఆయన గెలవడం కష్టమని స్పష్టం చేశారు. అప్పు తెచ్చి అయినా.. మీకు నగదు అందజేస్తున్నానని ఆయన అనుకుంటున్నారని ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ మాదిరిగా ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తే గెలుస్తామని భ్రమలో ఉన్నా జగన్ ఉన్నారని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం బఘేల్ వలే.. ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి బదులు నియోజకవర్గాలకు ప్రొవైడర్ మోడ్‌లోనే జగన్ ఉండిపోయారని ఈ సందర్భంగా పీకే గుర్తు చేశారు. గతంలో రాజుల్లా.. తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఇంకా ఏం చేయలేదన్నారు. ప్రజలకు నగదు బదిలీ చేశారు తప్పితే ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రాభివృద్ధిపై ఆయన శ్రద్ద పెట్టలేదని ప్రశాంత్ కిషోర్ వివరించారు.
ఇదే ప్రశాంత్‌కిషోర్ గత ఎన్నికల్లో వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను ఆశ్రయించారు … అగ్రిమెంట్ కుదరడంతో పీకే టీం రాష్ట్రంలో దిగింది… ఆ టీం స్క్రిప్ట్ ప్రకారమే వైయస్ జగన్ అడుగులు వేశారు. దాంతో 2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఆ క్రమంలో ఎన్నికల తర్వాత జగన్ స్వయంగా పీకేని కలిసి థాంక్స్ కూడా చెప్పివచ్చారు. అయితే సీఎం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జగన్ సంక్షేమాన్నే నమ్ముకుని.. నవరత్నాల అమలుకు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో ముంచారన్న విమర్శలున్నాయి .. బటన్ నొక్కి తాను ట్రాన్స్‌ఫర్ చేస్తున్న డబ్బుల గురించే ఈ సారి ఎన్నికల్లో ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు .. అదే విషయాన్ని స్పష్టం చేసిన పీకే .. ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పేశారు.
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఒకరొకరుగా రియాక్ట్ అవుతూ పీకేపై నిప్పులు కురిపిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ.. వాట్ నాన్సెన్స్ అంటూ తన స్టైల్లో చికాకు పడిపోతున్నారు. గత ఎన్నికల్లో పీకే వ్యూహాలు ఫాలో అయిఉంటే నిండా మునిగిపోయే వారిమని. అందుకే ఆయన్ని వ్యూహకర్త డ్యూటీ నుంచి పీకేసామని బొత్స అంటున్నారు. పీకే వ్యాఖ్యల వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ నీ బీహర్ నుండి తరిమికొడితే .. ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుత్నారని ప్రశాంత్‌కిషోర్‌ని టార్గెట్ చేస్తోంది వైసీపీ. మొత్తానికి పీకే నయా ఎనాలిసిస్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.