ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ముఖ్యనేతలు సహా పలువుర్ని అరెస్ట్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. తాజాగా మరిన్ని అరెస్టులు ఉంటాయన్న వార్తలు జోరందుకున్నాయి. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటీషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.
కవిత బెయిల్ పిటీషన్‌పై ఉదయం పదిన్నరకు స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. తన కొడుకు స్కూల్ ఎగ్జామ్స్ నిమిత్తం తనకు బెయిల్ ఇవ్వాలని కవిత పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఈడీ కూడా కౌంటర్ ఇచ్చింది. ఇప్పటికే ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వవద్దని న్యాయస్థానానికి తెలిపింది. ముఖ్యంగా కవిత బయటకు వస్తే దర్యాప్తుకు ఆటంకం కలుగుతోందన్నది ఈడీ వాదన.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. అంతకుముందు కవిత తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కవిత అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని వాదనలు వినిపించారు. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని.. అతను భయంతో ఉన్నాడని.. ఈ సమయంలో తల్లి పాత్ర అవసరమన్నారు.
ఏప్రిల్ 9వ వరకు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలులో ఉన్నారామె. కస్టడీకి ముందే బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించిన విషయం తెల్సిందే.