అర్థరాత్రి టీడీపీ ఆఫీసుకు నిప్పు, బాబు టూర్ తర్వాత..

ఎన్నికల వేళ పల్నాడులో ఫ్యాక్షన్ కక్షలు పురి విప్పినట్టు కనిపిస్తోంది. తాజాగా పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి నిప్పుపెట్టారు. అసలు ఎండాకాలం.. నిప్పు అంటుకోగానే క్షణాల్లో దగ్దమైంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కలవాళ్లు భయంతో హడలిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

 

పదిరోజుల కిందట మన్నెం భూషయ్య కాంప్లెక్స్‌లో పార్టీ ఆఫీసును ప్రారంభించారు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్. సభలు, సమావేశాలకు నిర్వహించేందుకు అనుకూలంగా తాటాకులతో కూడిన పందిరి ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పందిరికి నిప్పు అంటించడంతో క్షణాల్లో దగ్ధమైంది. సమీపంలోని అగ్నిమాపక కేంద్రం ఉన్నా మంటలు ఆర్పడానికి సిబ్బంది ఆలస్యంగా వచ్చారని చెబుతున్నారు టీడీపీ కార్యకర్తలు.

 

సమాచారం అందుకున్న వెంటనే క్రోసూరు నాలుగు రోడ్ల జంక్షన్ వద్దకు టీడీపీ, జనసేన నేతలు వచ్చారు. భాష్యం ప్రవీణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈక్రమంలో తెలుగుదేశం కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభ శనివారం జరిగింది. మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ సభ సక్సెస్ కావడంతో ఓర్వలేక ప్రత్యర్థి పార్టీ నేతలే ఈ పని చేసి ఉంటారని టీడీపీ క్యాడర్ చెబుతోంది.

 

మరోవైపు ఈ ఘటనపై భాష్యం ప్రవీణ్ మండిపడ్డారు. ప్రజాగళం సభకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేక దుశ్చర్యకు పాల్పడినట్టు ఆరోపించారు. వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డారని, పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న సమయంలో నంబూరు శంక్రరావు చిచ్చుపెట్టారని.. నిబద్దత, క్రమశిక్షణ గల టీడీపీ, నీచ రాజకీయాలు చేయదన్నారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *