గీతాంజలి.. ఈసారి నవ్వించనులేదు.. భయపెట్టనులేదు..

తెలుగమ్మాయి అంజలి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో గీతాంజలి ఒకటి. దాదాపు పదేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా అంజలికి మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే పేరుతో తెరకెక్కించారు. శివ తుర్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కోన వెంకట్ కథను అందివ్వడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో నటించగా.. సునీల్ ఒక ప్రత్యేక పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. హర్రర్ కామెడీగా సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. మొదటి పార్ట్ లో శ్రీనివాస్ రెడ్డి.. డైరెక్టర్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చూపించారు. గీతాంజలి కథను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినట్లు చూపించి అక్కడితో ఎండ్ చేశారు. ఇక దీని సీక్వెల్ లో శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ గా మారి సినిమా చేస్తున్నట్లు చూపించారు.

 

అంజలి.. హీరోయిన్ గా సునీల్ కెమెరా మ్యాన్ గా చూపించారు. వారు తీసే సినిమా హర్రర్ నేపథ్యంలో కాబట్టి ఒక పాత బంగ్లాలోకి వెళ్లి షూట్ చేస్తుంటారు. అయితే అక్కడే నివాసముంటున్న దెయ్యాలు.. వీరిని డిస్టర్బ్ చేస్తాయి. దెయ్యాలు కూడా తాము కళాకారులమని చెప్పి, తమను కూడా సినిమాలో చూపించమని అడగడంతో చేసేది లేక ఆ సినిమాలో దెయ్యాలను మెథడ్ యాక్టర్స్ అని పరిచయం చేసి సినిమా చేస్తూ ఉంటారు. ఇక ఆ సినిమా ఏమైంది..? అసలు ఈ దెయ్యాలు ఎవరు.. ? వారికి గీతాంజలికీ సంబంధం ఏంటి..? అనేది సినిమా చూడాల్సిందే. ట్రైలర్ లో హర్రర్ ఎలిమెంట్స్ ఎక్కడా భయపెట్టలేదు. కనీసం కామెడీ కూడా లేనట్లు కనిపిస్తుంది. లేకపోతే కావాలనే ట్రైలర్ ను ఇలా కట్ చేసారా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అంజలి ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *