చంద్రబాబు మోసానికి మారుపేరని నమ్మితే నట్టేట ముంచేస్తారని, వైసిపి అధినేత ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదని, ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని జగన్ పేర్కొన్నారు.
అందుకు మీరంతా సిద్ధమా? ఈ యుద్ధంలో తాను ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నేడు చిత్తూరు జిల్లాలో పలు బహిరంగ సభల్లో వైయస్ జగన్ రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలను తూర్పార పడుతున్నారు. డబల్ సెంచరీ కొట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని, మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా అంటూ ప్రజలను ప్రశ్నించారు.
సభకు వచ్చిన వారిని ప్రశ్నించిన జగన్ తాను ప్రతి ఇంటికి మంచి చేశానని, 130సార్లు బటన్ నొక్కి సంక్షేమం అందించానని సీఎం జగన్ పేర్కొన్నారు. పేదల వ్యతిరేకులను, పెత్తందార్లను ఓడించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? అని జగన్ సభకు వచ్చినవారిని ప్రశ్నించారు. 175కి 175 అసెంబ్లీసీట్లు గెలవడమే మన టార్గెట్ అని చెప్పిన జగన్ 25కి 25 ఎంపీ సీట్లు కూడా కైవసం చేసుకోవాలని, మొత్తం డబల్ హ్యాట్రిక్ సాధించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఓ వైపు విశ్వసనీయత .. మరోవైపు మోసం.. నిర్ణయం మీదే ఎవరి వల్ల మీకు మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలను ఉద్దేశించి జగన్ చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం కూడా గుర్తుకు రాదని, చంద్రబాబు మీ ఖాతాలలో ఒక రూపాయి కూడా వేయలేదని పేర్కొన్న జగన్ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం తాను ఎన్నో కార్యక్రమాలు చేసినట్టుగా తెలిపారు. ఒకవైపు విశ్వసనీయత మరోవైపు మోసం ఉన్నాయని, ప్రజలు ఏ వైపు ఉంటారో నిర్ణయించుకోవాలి అన్నారు.
ఇన్ని కుట్రలు కుతంత్రాలు అవసరమా? ఒకవైపు నిజం మరోవైపు అబద్ధం ఉన్నాయని, నిజమేదో అబద్ధం ఏదో ప్రజలే గుర్తించాలన్నారు. ఒక్కడిని ఓడించడానికి ఇంతమంది కట్టకట్టుకుని వస్తున్నారని, ఇన్ని జెండాలు ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయని , కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అన్ని చంద్రబాబు పక్షమే అని పేర్కొన్న జగన్ ప్రజలు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు.