ఏపీలో ఇప్పటి వరకు రూ. 34 కోట్లు సీజ్, 3300 ఎఫ్ఐఆర్​లు: ఈసీ వెల్లడి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ఇప్పటి వరకు రూ. 34 కోట్ల రూపాయల విలువైన నగదు, వస్తువులు సీజ్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రూ. 11 కోట్ల నగదు, రూ. 7 కోట్ల మద్యం, రూ. 10 కోట్ల మేర బంగారం, వెండి ఆభరణాలను తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయని వివరించారు.

 

నగదు, మద్యం, వాహనాలు తదితర అంశాలపై 3300 ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినట్టు ఈసీ ముఖేష్ కుమార్ మీనా వెల్లడిచారు. ఈసీకి చెందిన సి-విజిల్ యాప్ ద్వారా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నట్టు తెలిపారు. అయితే, షెడ్యూల్ విడుదల నుంచి ఇప్పటి వరకూ సి-విజిల్ యాప్ ద్వారా 5500 ఫిర్యాదులు అందాయని, ఎన్నికలకు సంబంధించి 3040 ఫిర్యాదులను పరిష్కరించినట్టు వివరించారు.

 

నియమావళి ఉల్లంఘిస్తూ ఏర్పాటైన హోర్డింగులు, ఫ్లెక్సీలపై 1600 ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికల అధికారి తెలిపారు. మరోవైపు, ఎన్నికల కోడ్ ఉన్నా అనుమతి లేకుండా ప్రచారం చేస్తున్న వ్యవహారాలపై 107 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారంలో వాహనాల వాడకంపై 43 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. మతపరమైన ప్రచారాలపై 28, నగదు పంపిణీపై 29, మద్యం పంపిణీపై 17 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

 

ఇది ఇలావుండగా, సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులు, డీజీపీలతో సీఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతియుతంగా ఎన్నిక నిర్వహణ లక్ష్యంగా 2024 ఎన్నికలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం, నగదు, డ్రగ్స్, ఆయుధాలు, ఉచిత వస్తువులు పంపిణీని అరికట్టాల్సిందిగా సూచించారు. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల్లో నిరంతరం నిఘా ఉండాలని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టంచేశారు. హింసరహిత ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రాలకు తగినన్ని సాయుధ పోలీసు బలగాలను మోహరించినట్టు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *