ఏపీలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చినట్టే! అభ్యర్థులను ఒకేసారి ప్రకటించింది అధికార వైసీపీ. ఇక టీడీపీ నాలుగైదు విడతలుగా వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ కూడా మంగళవారం దాదాపు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇక పెండింగ్ లో జనసేన, బీజేపీలు మాత్రమే ఉన్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్ని కోణాల్లో పరిశీలించి పెండింగ్ లో ఉన్న ఇద్దరు అభ్యర్థులను దాదాపు ఫైనల్ చేసినట్టు సమాచారం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. వారం రోజులపాటు అన్నికోణాల్లో పరిశీలించిన పవన్ కల్యాణ్.. గెలిచే అభ్యర్థులను వడపోసి మరీ ఎంపిక చేశారు.
టీడీపీ నేతలైన బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ రీసెంట్ గా జనసేనలో చేరారు. దీంతో దాదాపు అభ్యర్థులను ఎంపిక పూర్తి అయినట్టే. ఇక ప్రచారంలోకి దిగడమే మిగిలివుంది. ఇదిలా వుండగా ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరు అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ జనసేన ఇన్ ఛార్జ్ రూపానంద్ రెడ్డికి సన్నిహితుడైన అరవ శ్రీధర్ ను బరిలోకి దింపే అవకాశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ బుధవారం అభ్యర్థి మార్పుపై కొలిక్కి రావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక జనసేన అధినేత ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ వారంలోనే బీజేపీ కూడా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నమాట. అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నంకానున్నారు. ఇక ముఖ్యనేతల సభలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
టీడీపీ ఒక చోట, జనసేన మరోవైపు, బీజేపీ ఇంకోవైపు సభలను నిర్వహించనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా రెండు రోజుల్లో విడుదలకానుంది. ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి అభ్యర్థులు తమతమ నియోజకవర్గంలో నిమగ్నమై ఉండాలన్నది హైకమాండ్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారంలోకి దిగిన వెంటనే పార్టీల మధ్య మాటల వార్ కొనసాగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.