ఏపీలో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ప్రచారంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ప్రజాగళం పేరుతో తొలి విడత ప్రచారం పూర్తి చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతున్నారు.
ప్రజాగళం యాత్ర మరోసారి చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. రెండో విడత ప్రచారానికి షెడ్యూల్ ఖరారైంది. బుధవారం నుంచి యాత్ర చేపట్టనున్నారు. మొత్తం 5 రోజులపాటు వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 3న కొత్తపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 4న కొవ్వూరు, గోపాలపురంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5న నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో ప్రజాగళం యాత్ర చేపడతారు.
ఏప్రిల్ 6న పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఏప్రిల్ 7న పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. దీంతో రెండో విడత ప్రజాగళం యాత్ర ముగుస్తుంది.
రోజూ సాయంత్రం 4 గంటలకు ఒక నియోజకవర్గంలో సభ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు మరో సభ నిర్వహిస్తారు. ప్రజాగళం యాత్ర తొలివిడతలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 15 నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు.
రెండో విడతలో 10 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇలా విడతల వారీగా అన్ని నియోజకవర్గాలు చుట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రచారం నిర్వహిస్తున్నారు.