కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియాతో సహా ఢిల్లీ మద్యంకేసు కీలక నిందితులంతా తీహార్ జైల్లోనే!!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు జరిగి నెల రోజులైంది. వరుసగా తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరు కావడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిరాకరించడంతో, ఆయన ఇంటికి వెళ్లి సోదాలు జరిపిన ఈడి అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.

 

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఆసక్తికర పరిణామం అని చెప్పాలి . అంతకుముందు ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి, కస్టడీలో ఆమెను విచారించి, ఆపై కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు.

 

ఇక ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీష్ సిసోడియా కూడా ఇదే జైలులో ఉన్నారు. అంతేకాదు మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మనీలాండరింగ్ కేసులో ఇదే జైల్లో ఉన్నారు. హవాలా నెట్వర్క్ ద్వారా సెల్ కంపెనీలతో మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఇక తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి.

 

అలాగే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో కవిత పైన, అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా సుకేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరంతా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తీహార్ జైలుకు తరలించబడిన అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లోని జైలు నెంబర్ 2 లో ఉన్నారు.

 

ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆయన జ్యుడీషియల్ రిమాండ్ ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించడం తో కస్టడీ గడువు వరకు ఆయన జైలు నెంబర్ రెండు లోనే ఉండనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా తీహార్ జైల్లోనే జైలు నెంబర్ 1 లో ఉండగా, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ జైలు నెంబర్ 7 లో ఉన్నారు.

 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లోని మహిళా జైలులో జైలు నెంబర్ 6 లో ఉంటున్నారు. రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైలు నెంబర్ 5లో ఉంటున్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ కూడా తీహార్ జైల్లోనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *