ఎన్నికల వేళ.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు: లెక్కింపు పక్రియలో కీలక మార్పులు..

దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి రోజురోజుకూ ఉధృతమౌతోంది. అన్ని పార్టీలూ ఎన్నికల సంగ్రామంలో దిగాయి. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ- కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా హోరాహోరీగా తలపడుతున్నాయి.

 

ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ఇదివరకే విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ ఉంటుంది. తొలి దశ పోలింగ్ ఈ నెల 19వ తేదీన షెడ్యూల్ అయింది. 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. జూన్ 1వ తేదీన జరిగే చివరి విడత పోలింగ్‌తో ఎన్నికలు పూర్తవుతాయి. అదే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు.

 

ఈ పరిస్థితుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానంలో కీలక పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది కూడా. పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ప్రింట్ అయ్యే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్.. (VVPAT)కు సంబంధించిన పిటీషన్లు అవి.

 

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రతినిధులు, ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త అరుణ్ కుమార్ అగర్వాల్ వేర్వేరుగా ఈ పిటీషన్లు వేశారు. ఇప్పుడు కొనసాగుతున్న వీవీప్యాట్ లెక్కింపు ప్రక్రియలో మార్పులు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఈ దిశగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలను జారీ చేయాలని వారు అభ్యర్థించారు.

 

ప్రతి ఈవీఎంలో కూడా ర్యాండమ్‌గా తీసిన అయిదు వీవీప్యాట్ స్లిప్పులకు బదులుగా- అన్నింటినీ లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ పిటీషన్లపై విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నోటీసులను జారీ చేసింది. మొత్తం వీవీప్యాట్‌ల లెక్కింపుపై తమ అభిప్రాయాలను తెలియజేయాలంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *