వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారు..

తెలంగాణలో మరో పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. వరంగల్ ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్యను ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రకటించింది. ఈమేరకు సోమవారం రాత్రి జాబితా విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు.

 

కాగా, ఆదివారంనాడు సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్‌లో కండువా కప్పుకున్నారు. కడియం కావ్యతోపాటు మరో ఎంపీ అభ్యర్థిని కూడా కాంగ్రెస్ ఖరారు చేసింది. మహారాష్ట్రంలోని అకోలా అభ్యర్థిగా డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్ పేరును ప్రకటించింది.

 

కడియం శ్రీహరితోపాటు కావ్య ఆదివారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ లోక్‌సభ టికెట్ ఇవ్వగా.. ఆ పార్టీ నుంచి పోటీ చేసే ఉద్దేశం తనకు లేదంటూ ఆమె నిరాకరించారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ ఇప్పటి వరకు 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

 

కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకే ఆ పార్టీలో చేరినట్లు కడియం శ్రీహరి తెలిపారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లానని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు. బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

 

లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్‌లో చేరానన్న కడియం.. దేశంలో, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా పార్టీలోని నేతలతో సమావేశమవుతున్నానని, అందులో భాగంగానే వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్‌.నాగరాజుతో భేటీ అయ్యానని తెలిపారు. ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని ఎప్పుడూ మరవనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *