పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన..

ఏపీలో వైఎస్సార్ భరోసా పథకం కింద ఇస్తున్న వృద్ధాప్య, ఇతర సామాజిక పెన్షన్ల పంపిణీని వాలంటీర్లతో చేయించవద్దని సీఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తోంది.

 

ఇప్పటికే ఏప్రిల్ లో రెండు రోజులు ఆలస్యంగా పెన్షన్లు పంపిణీ చేస్తామని గత నెలలోనే ప్రకటించిన ప్రభుత్వం.. ఆ మేరకు ఏప్రిల్ 3న ఈ కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.

 

ఓవైపు వాలంటీర్లతో పెన్షన్లు సహా ఇతర సామాజిక పథకాలేవీ పంపిణీ చేయించవద్దన్న ఈసీ ఉత్తర్వులు, మరోవైపు దీనికి కారణం మీరంటే మీరంటూ అధికార, విపక్షాలు చేసుకుంటున్న ఆరోపణల నేపథ్యంలో లబ్దిదారుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందులో పెన్షన్లను పంపిణీ చేసేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో మెజార్టీ కలెక్టర్లు సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయిస్తే సరిపోతుందని సూచించారు.

 

దీంతో సచివాలయాల వద్దే ఏప్రిల్ 3వ తేదీన సంక్షేమ కార్యదర్శులతో పెన్షన్లు పంపిణీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ రాత్రికి ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. ఎల్లుండి పెన్షన్ల పంపిణీకి సంబంధించి కలెక్టర్లకు మార్గదర్శకాలు విడుదల చేయాలని సీఎస్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాత్రికి వారు పెన్షన్ల పంపిణీ ఎలా నిర్వహించాలన్న దానిపై సూచనలు చేయనున్నారు. ఇదంతా సజావుగా జరిగిపోతే రాజకీయంగా పెన్షన్లపై మొదలైన రగడ కూడా సమసిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *