ఏపీలో రాజకీయం అంతా ఓ ఎత్తు పిఠాపురం రాజకీయం ఓ ఎత్తు అన్నట్లుగా మార్చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. పిఠాపురంలో మూడు రోజులుగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్.. అక్కడ తనకు ఎదురైన అనుభవాలపై ఇవాళ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
ముఖ్యంగా అభిమానుల ముసుగులో వచ్చిన కొందరు తనతో ఎలా ప్రవర్తిస్తున్నారన్న దానిపై పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఇవాళ పిఠాపురంలో టీడీపీతో పాటు పలు పార్టీల నేతలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభిమానుల పేరుతో ఫొటోల కోసం వస్తున్న కిరాయి మూకలు బ్లేడ్లతో తననూ, తన భద్రతా సిబ్బందిని కోస్తున్నారంటూ వెల్లడించారు. సన్న బ్లేడ్లు తీసుకొచ్చి ఇలా కోస్తున్నారని పవన్ తెలిపారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అందరికీ సూచించారు.
మన ప్రత్యర్ధి పార్టీ సంగతి తెలుసు కదా అంటూ వైసీపీని ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు అభిమానులతో ఫొటోలు దిగడంలో ఎలాంటి ఇబ్బందీ లేదని, రోజుకు 200 మందితో ఫొటోలు దిగుతానని, కానీ ఈ విషయంలో ప్రోటోకాల్ పాటిద్దామంటూ పవన్ కీలక సూచన చేశారు. ఇకపై ప్రతీ రోజూ పిఠాపురంలో 200 మందితో ఫొటోలు దిగేందుకు అవకాశం ఇస్తానని జనసేనాని వెల్లడించారు. పిఠాపురాన్ని తన స్వస్ధలం చేసుకోవాడనికే వచ్చానని పవన్ గుర్తు చేశారు.