ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని టీడీపీతో పాటు ఇతర విపక్షాలు కూడా ముక్తకంఠంతో కోరడంతో సీఈసీ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకటో తేదీన అందాల్సిన పెన్షన్లు అందడం లేదంటూ అధికార వైసీపీ గగ్గోలు పెడుతోంది. ఈ నేపథ్యంలో మరో వర్గానికి చెందిన ఉద్యోగుల్ని కూడా ఎన్నికలకు దూరంగా ఉంచాలని టీడీపీ తాజాగా ఈసీని కోరింది.
రాష్ట్రంలో ఈసారి ఎన్నికల విధుల కోసం ప్రస్తుతం సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పోలీసులను ఎప్పటిలాగానే ఈసీ బాధ్యతలు అప్పగిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచడంతో 60 ఏళ్లకు పైబడిన వారు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. వీరు రెగ్యులర్ డ్యూటీలు చేయడమే కష్టంగా ఉంది. కానీ ఈసీ ఇప్పుడు వీరిని కూడా ఎన్నికల విధుల్లోకి తీసుకుంటోంది.
Tdp requests CEC to exempt teachers and employees above 60 years from poll duties
దీనిపై స్పందించిన విపక్ష టీడీపీ .. రాష్ట్రంలో 60 సంవత్సరాలు పైబడిన ఉపాధ్యాయులు ,ఉద్యోగులు ,పోలీసులను ఎన్నికల విధులనుంచి మినహాయించాలని ఈసీని కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఓ లేఖ రాశారు. ఇందులో ఇలా మినహాయింపు కోరడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. 60 ఏళ్లకు పైబడిన ఉద్యోగులు ఎన్నికల వత్తిడిని తట్టుకోలేరని ఆయన తెలిపారు.
అలాగే గుండె సంబంధిత వ్యాధి వున్నవారు ,గర్భిణీ మహిళా ఉద్యోగులు ,చంటి పిల్లలు వున్న వారిని ,కోవిద్ 19 బారిన పడి ఇబ్బంది పడిన వారికి ఎన్నికల విధులనుంచి మినహాయించాలని కేంద్ర ,రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈసీ స్పందించాల్సి ఉంది.