బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమపై కావాలనే పనిగట్టుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ పలు టీవీ, యూట్యూబ్ ఛానెళ్లకు లీగల్ నోటీసులు పంపించారు. సంబంధం లేని అంశాల్లో తమ పేరు, ఫోటోలను ప్రస్తావిస్తున్నట్లు నోటీసులో వివరించారు. మీడియా సంస్థలతోపాటు యూట్యూబ్ ఛానెళ్లపై పరువునష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు.
అంతేకాదు రాబోయే రోజుల్లో నోటీసులతోపాటు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు కేటీఆర్. కేవలం తమను, తన కుటుంబాన్ని బద్నామ్ చేసేందుకు అసత్య ప్రచారాలను కట్టుకథలను అల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ముఖ్యంగా మీడియా ముసుగులో ఈ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
మాకు సంబంధం లేని అంశాలను అంటగడుతూ చేసిన వీడియోలను తొలగించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. వాటిని తొలగించకుంటే మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కేటీఆర్ నోటీసులపై సోషల్ మీడియా వేదికగా చాలామంది రియాక్ట్ అయ్యారు.