ఎం అండ్ ఎం సరికొత్త రికార్డు
ముంబై: దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త రికార్డును సాధించింది. మంగళవారం నాటి లాభాలతో రూ.1 లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్లబ్‌లో చేరింది. వాతావరణ శాఖ అందించిన సాధారణ వర్షపాత అంచనాలు ( 97 శాతం వర్షపాతం) ఎం అండ్ ఎండ్ షేర్‌కు పాజిటివ్ సంకేతాలను అందించాయి. దీంతో ఈ ఏడాది సాధారణ వర్షపాత అంచాలు వెలువడిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ బలపడింది. ట్రాక్టర్ల దిగ్గజం ఎం అండ్ ఎం కౌంటర్‌లో కొనుగోళ్లు చేపట్టారు. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) రూ. 1.01 లక్షల కోట్లకు చేరింది. వెరసి రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను చేరుకోవడం విశేషం. మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం క్యాప్) నిన్నటి రూ .99,605 కోట్ల నుంచి ,225.32 కోట్ల రూపాయల మేర పెరిగి రూ .1,01,829.91 కోట్లకు చేరింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రీత్యా కంపెనీ తాజాగా 30వ ర్యాంకును అందుకుంది.
ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 1.5 శాతం పెరిగి రూ. 812 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 819 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. తద్వారా దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌కు సైతం చేరువైంది. ప్రస్తుతం టాటా మోటార్స్ మార్కెట్ క్యాప్ డీవీఆర్లతో కలిపి రూ. 1.08 లక్షల కోట్ల వద్ద ఉంది. మార్చిలో వాహన విక్రయాలు 10 శాతం పుంజుకున్న నేపథ్యంలో ఎంఅండ్‌ఎం షేరు ఈ నెలలో 9 శాతం లాభపడింది.